ఆదికాండము 24
24
1అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. 2అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము; 3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక 4నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను. 5ఆ దాసుడు – ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొని పోవలెనా అని అడుగగా 6అబ్రాహాము–అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ. 7నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశమునుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి–నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణముచేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు. 8అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవుగాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను. 9ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను. 10అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్ఠమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న#24:10 మెసపొతేమియ. నాహోరు పట్టణము చేరి 11సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను 12–నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాముమీద అనుగ్రహము చూపుము. 13చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. 14కాబట్టి–నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా –నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను. 15అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజముమీద పెట్టుకొనివచ్చెను. 16ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా 17ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి –నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను. 18అందుకామె–అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. 19మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత–నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి 20త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించితిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. 21ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను. 22ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి 23–నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను. 24అందుకామె –నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. 25మరియు ఆమె–మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా 26-27ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి – అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను. 28అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను. 29రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను. 30అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి–ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా 31లాబాను–యెహోవావలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. 32ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితోకూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి 33అతనికి భోజనము పెట్టించెనుగాని అతడు–నేను వచ్చిన పనిచెప్పకమునుపు భోజనము చేయననగా లాబాను –చెప్పుమనెను. 34-35అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. 36నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు; 37మరియు నా యజమానుడు నాతో–నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు. 38అయితే నా తండ్రి యింటి కిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను. 39-40అప్పుడు నేను నా యజమానునితో –ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు అతడు –ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతోకూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు 41నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. 42నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి–అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసినయెడల 43నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను–నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు 44–నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవిచేసికొంటిని. 45నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు–నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా 46ఆమె త్వరగా తన కడవను దించి –త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. 47అప్పుడు నేను–నీవు ఎవరికుమార్తెవని యడిగినందుకు ఆమె –మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి 48నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానునియొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. 49కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెద ననగా 50లాబానును బెతూయేలును–ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవుననిగాని కాదనిగాని చెప్ప జాలము; 51ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తర మిచ్చిరి. 52అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. 53తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. 54అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమునవారు లేచి నప్పుడు అతడు–నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా 55ఆమె సహోదరుడును ఆమె తల్లియు–ఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి. 56అప్పుడతడు–యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు 57వారు–ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని 58రిబ్కాను పిలిచి–ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు –వెళ్లెదననెను. 59కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు 60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా 61రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.
62ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. 63సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, 64రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి 65–మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడు–ఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. 66అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను. 67ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను.
Currently Selected:
ఆదికాండము 24: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.