YouVersion Logo
Search Icon

ఆదికాండము 19

19
1ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి 2–నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి. 3అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనముచేసిరి. 4వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి 5లోతును పిలిచి–ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా 6లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి 7– అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి; 8ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. 9ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు–నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు–వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి. 10అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి. 11అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. 12అప్పుడామనుష్యులు లోతుతో–ఇక్కడ నీకు మరియెవ రున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము; 13మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి; వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్ప దాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా 14లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి–లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను. 15తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి–లెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి. 16అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి. 17ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన–నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా 18-19లోతు–ప్రభువా ఆలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షిం చుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపర చితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో 20ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు 21ఆయన– ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని; 22నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు#19:22 అనగా, చిన్నది. అను పేరు పెట్టబడెను.
23లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. 24అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి 25ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను. 26అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమాయెను. 27తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి 28సొదొమ గొమొఱ్ఱాలతట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను. 29దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.
30లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతోకూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. 31అట్లుండగా అక్క తన చెల్లెలితో–మన తండ్రి ముసలివాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. 32మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను. 33ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. 34మరునాడు అక్క తన చెల్లెలిని చూచి–నిన్నటి రాత్రి నా తండ్రితో నేనుశయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. 35ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. 36ఆలాగున లోతుయొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి. 37వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడెను. 38చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in