YouVersion Logo
Search Icon

ఆదికాండము 14

14
1షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో 2వారు సొదొమరాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. 3వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి 4పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగు బాటు చేసిరి. 5పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితోకూడనున్న రాజులును వచ్చి అష్తా రోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో 6ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారానువరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత 7తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి. 8అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, 9అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి. 10ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించినవారు కొండకు పారిపోయిరి. 11అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొనిపోయిరి. 12మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా 13తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు. 14అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచ బడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. 15రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టుననున్న హోబా మట్టుకు తరిమి 16ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను. 17అతడు కదొర్లాయోమెరును అతనితోకూడ నున్న రాజులను ఓడించితిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. 18మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 19అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి–ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, 20నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను. 21సొదొమ రాజు–మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా 22-23అబ్రాము–నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. 24అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in