YouVersion Logo
Search Icon

ఎజ్రా 1

1
1పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను 2–పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా – ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. 3కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక. 4మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. 5అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితోకూడుకొని వచ్చి, యెరూషలేములోఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. 6మరియు వారి చుట్టు నున్నవారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. 7మరియు నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములనురాజైన కోరెషు బయటికి తెప్పించెను. 8పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. 9వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును 10ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియైయుండెను. 11బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోను చెరలోనుండి విడిపింపబడినవారితోకూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

Currently Selected:

ఎజ్రా 1: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in