యెహెజ్కేలు 6
6
1యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రకటించుము 3–ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నతస్థలములను నాశనము చేసెదను. 4మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను. 5ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలిపీఠములచుట్టు పారవేయుదును. 6నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్నములగును, సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడ గొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నతస్థలములు విడువబడును, 7మీ జనులు హతులై కూలుదురు. 8అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను. 9మరియు నన్ను విసర్జించినవారి విశ్వాసఘాతకమైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు 10నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు.
11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – నీచేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు. 12దూరముననున్నవారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. 13తమ విగ్రహములమధ్యను తాముకట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటిక్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. 14నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
Currently Selected:
యెహెజ్కేలు 6: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.