యెహెజ్కేలు 46
46
1ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను. 2అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు. 3మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. 4విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును. 5పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతోకూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను. 6అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను. 7నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను. 8అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. 9అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరా ధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. 10అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను. 11పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. 12యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. 13మరియు ప్రతిదినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను దహనబలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. 14అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. 15గొఱ్ఱెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను.
16ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము. 17అయితే అతడు తన పనివారిలో ఎవని కైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. 18జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.
19పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను. 20ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి–యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధపరిహారార్థబలిపశుమాంసమును పాపపరిహారార్థబలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే యని నాతోచెప్పి 21అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనివచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణముయొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను. 22ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను. 23మరియు ఆ నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకల క్రింద పొయిలుండెను. 24–ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.
Currently Selected:
యెహెజ్కేలు 46: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.