యెహెజ్కేలు 43
43
1తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా 2ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను. 3నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని. 4తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను. 5ఆత్మ నన్నుఎత్తి లోపటి ఆవరణములోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను. 6మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను. 7–నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించెదను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరములకు ఉన్నతస్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి 8నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని. 9వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరములను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును.
10కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. 11తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాద లన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లువారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. 12ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే.
13మూరల కొలచొప్పున బలిపీఠముయొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జేనెడు; బలిపీఠమునకు పీఠమొకటి యుండవలెను. దాని డొలుపు మూరె డెత్తును మూరెడు వెడల్పును చుట్టు దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. 14నేలమీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరువరకును ఎత్తు రెండు మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరువరకు నాలుగు మూరలు, దాని వెడల్పు మూరెడు. 15దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్నిగుండమునుండి పైకి నాలుగు కొమ్ము లుండెను, 16దేవాగ్నిగుండము పండ్రెండు మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను. 17మరియు చూరు నిడి వియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు, దాని చుట్టునున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు మూరెడు, డొలుపు ఒకటి యుండెను, దానికున్న మెట్లు తూర్పుతట్టుండెను.
18మరియు అతడు నాతో ఇట్లనెను–నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి, దహనబలులు అర్పించుటకై విధులనుబట్టి ఈలాగున జరిగింపవలెను. 19ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–పరిచర్యచేయుటకై నా సన్నిధికివచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాపపరిహారార్థబలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. 20వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను. 21తరువాత పాపపరిహారార్థబలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతలమందిరమునకు చేరిన నిర్ణయస్థలములో దానిని దహనము చేయవలెను. 22రెండవదినమున పాప పరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేకపిల్లను అర్పింపవలెను; కోడెచేత బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను. 23దాని నిమిత్తము పాపపరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను. 24యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. 25ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 26ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. 27ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్ము నంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 43: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.