యెహెజ్కేలు 32
32
1మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవనెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము–జనములలో కొదమ సింహమువంటివాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి. 3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. 4నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను, 5నీ మాంసమును పర్వతములమీద వేసెదను, లోయలన్నిటిని నీ కళేబరములతో నింపెదను. 6మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును. 7నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును. 8నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 9నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును, 10నా ఖడ్గమును నేను వారిమీద ఝుళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు. 11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–బబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును, 12శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; వారు ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును. 13మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును. 14అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 15నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. 16ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తునుగూర్చియు అందులోని సమూహమునుగూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
17పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 18–నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జనముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. 19సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము. 20ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి. 21వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అనియందురు; పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు. 22అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చియున్నారు. 23దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. 24అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితోకూడ వారు అవమానము నొందుదురు. 25హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితోకూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును. 26అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవులలోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి. 27అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవులలోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను. 28నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు. 29అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి. 30అక్కడ ఉత్తరదేశపు అధిపతులందరును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవ మానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు. 31కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 32సజీవులలోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితోకూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 32: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.