YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 3

3
1మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. 2నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి 3–నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.
4మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. 5నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను. 6నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపినయెడల వారు నీ మాటలు విందురు. 7అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలినవారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. 8ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురువలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను. 9నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగాఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. 10మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని 11బయలుదేరి చెరలోనున్న నీ జనులయొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను.
12అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా–యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. 13మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను 14ఆత్మ నన్నెత్తి తోడుకొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. 15నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినవారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి యేమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై యేడు దినములు వారి మధ్యనుంటిని.
16ఆ యేడు దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 17– నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము. 18అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. 19అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్‌క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు. 20మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణమవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును. 21అయితే–పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చరింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు.
22అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, –నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. 23నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను. 24నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువ బెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారు నీ మీద పాశములువేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్లక యింటికిపోయి దాగియుండుము. 25-26వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను. 27అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయి–వినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in