యెహెజ్కేలు 18
18
1మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు? 3నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 4మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును. 5ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి 6పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు, 7ఎవనినైనను బాధపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి 8వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి 9యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 10అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి 11చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, 12దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహములతట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, 13అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును. 14అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా 15పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, 16ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి 17బీదవాని మీద అన్యాయముగా చెయ్యివేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండినయెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును. 18అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును. 19అయితే మీరు–కుమారుడు తన తండ్రియొక్క దోషశిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవ శ్యముగా బ్రదుకును. 20పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోషశిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోషశిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. 21అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. 22అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును. 23దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 24అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులుచేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును. 25అయితే–యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది? 26నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును? 27మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించినయెడల తన ప్రాణము రక్షించుకొనును.#18:27 లేక, అతడు బ్రదుకును. 28అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును. 29అయితే ఇశ్రాయేలీయులు–యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు. 30కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. 31మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 32మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 18: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.