యెహెజ్కేలు 14
14
1అంతట ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా 2యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 3–నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా? 4కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకువచ్చు ఇశ్రాయేలీయులందరు 5తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను. 6కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– మీ విగ్రహములను విడిచిపెట్టి మీరుచేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి 7ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను. 8ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలోనుండి నేను వారిని నిర్మూలము చేసెదను. 9మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలోనుండి వానిని నిర్మూలముచేసెదను 10ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాముచేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండు నట్లును 11వారు ఆలాగున తమకు కలుగజేసికొనిన దోషమునకు శిక్షనొందుదురు, ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు.
12మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 13–నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారములేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును 14నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములోనుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 15బాటసారులు సంచరింపకుండ ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా 16ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 17నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి–నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చినయెడల 18ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 19అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మ రించినయెడల 20నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు 21ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేముమీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు 22దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లువారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపెట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు 23మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 14: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.