యెహెజ్కేలు 12
12
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడక యున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు. 3నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని, పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై, నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీని చూచి విచారించు కొందురేమో 4దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లువారు చూచుచుండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను 5వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము 6వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజముమీద పెట్టుకొని నేల కనబడకుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. 7ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని 8ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 9–నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము 10–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును 11కాబట్టి వారికీమాట చెప్పుము–నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు 12మరియు వారిలో ప్రధాను డగువాడు రాత్రియందు సామగ్రిని భుజముమీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడకుండ ముఖము కప్పుకొని పోవును 13అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును 14మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను 15నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహో వానైయున్నానని వారు తెలిసికొందురు 16అయితే నేను యెహోవానైయున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.
17మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 18–నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి 19దేశములోని జనులకీలాగు ప్రకటించుము–యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలుదేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు 20నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసి కొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును.
21మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 22–నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? 23కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము –ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము–దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెర వేరును 24వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. 25యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
26మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 27–నరపుత్రుడా–వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగినతరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా 28కాబట్టి నీవు వారితో ఇట్లనుము– ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 12: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.