YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 1

1
1ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవదినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను. 2-3యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవదినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను. 4నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను. 5దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. 6ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలునుగలవు. 7వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను. 8వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలు గింటికిని ముఖములును రెక్కలును ఉండెను. 9వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. 10ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు. 11వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను. 12అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. 13ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవులమధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను. 14మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. 15ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను. 16ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. 17అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. 18వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను. 19ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్రములు కూడ లేచెను. 20ఆత్మ యెక్కడికి పోవునో అక్క డికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను. 21జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను. 22మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటిక ముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను. 23ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈతట్టుననున్న జీవులకును ఆతట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను. 24అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరమువలెను దండువారుచేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. 25అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశమండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను. 26వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. 27చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. 28వర్ష కాలమున కనబడు ఇంద్రధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. –

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in