YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 8

8
1యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము; 2నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను. 3ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకులయిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును; 4ఆ కప్పలు నీ మీదికి నీ జనులమీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. 5మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయలమీదను కాలువలమీదను చెరువులమీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా 6అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. 7శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి. 8అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడు కొనుడి, అప్పుడు యెహోవాకుబలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను. 9అందుకు మోషే–నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. 10అందుకతడు–మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాటచొప్పున జరుగును; 11అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలోనుండియు నీ సేవకులయొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగిపోవును; అవి యేటిలోనే ఉండుననెను. 12మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా 13యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను. 14జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. 15ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
16అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. 17అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు#8:17 లేక, మిన్నల్లి. మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. 18శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరిగాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా 19శకునగాండ్రు –ఇది దైవశక్తి#8:19 మూలభాషలో–దేవుని వ్రేలు. అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను. 20కాబట్టి యెహోవా మోషేతో –నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 21నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయులయిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. 22మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించు చున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపులుండవు. 23నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను. 24యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోనికిని అతని సేవకుల యిండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను. 25అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా 26మోషే– అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించినయెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. 27మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను. 28అందుకు ఫరో–మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదనుగాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను. 29అందుకు మోషే–నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనులయొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి 30ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. 31యెహోవా మోషే మాటచొప్పునచేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకులయొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు. 32అయితే ఫరో ఆ సమయమున కూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in