YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 6

6
1అందుకు యెహోవా–ఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను.
2మరియు దేవుడు మోషేతో ఇట్లనెను–నేనే యెహోవాను; 3నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. 4మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. 5ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను. 6కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి, 7మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు. 8నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా 9మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమునుబట్టియు మోషే మాట వినరైరి.
10-11మరియు యెహోవా మోషేతో–నీవు లోపలికి వెళ్లి, ఐగుప్తురాజైన ఫరోతో–ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను. 12అప్పుడు మోషే–చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. 13మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను–ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారికాజ్ఞాపించెను.
14వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు. 15షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు. 16లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. 17గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ. 18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను. 19మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. 20అమ్రాము తన మేనత్తయైన యోకె బెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. 21ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ 22ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ. 23అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహో దరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను. 24కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు. 25అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమతమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు. 26ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. 27ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించ వలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడినవారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.
28ఐగుప్తుదేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున 29యెహోవా–నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా 30మోషే–చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in