YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 24

24
1మరియు ఆయన మోషేతో ఇట్లనెను–నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. 2మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 3మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు–యెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తర మిచ్చిరి. 4మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి 5ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలులనర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి. 6అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. 7అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు –యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. 8అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి–ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. 9తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి 10ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను. 11ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
12అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా 13మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. 14అతడు పెద్దలను చూచి–మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను. 15మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. 16యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవదినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు 17యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. 18అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్లు నలుబది దినములుండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in