ఎస్తేరు 5
5
1మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను. 2రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండముయొక్క కొన ముట్టెను. 3రాజు – రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా 4ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. 5ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. 6రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా 7ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను– రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే 8రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయుననెను. 9ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దకైమీద బహుగా కోపగించెను. 10అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తన స్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి 11తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను. 12మరియు అతడు–రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. 13అయితే యూదుడైన మొర్దకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజన మేమియు లేదని అతడు చెప్పగా 14అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును–ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతోకూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.
Currently Selected:
ఎస్తేరు 5: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.