YouVersion Logo
Search Icon

ఎస్తేరు 2

2
1ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషుయొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా 2యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి–అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును, 3అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత 4రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.
5షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను. 6బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు. 7తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. 8రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను. 9ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళక్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను. 10మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు. 11ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురముయొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దకై తిరుగులాడు చుండెను. 12ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళక్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళక్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చి నప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునవారు పరిమళక్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను. 13మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు. 14సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనేగాని ఆమె రాజు నొద్దకు మరల వెళ్లకుండెను. 15మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణ యించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను. 16ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా 17స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను. 18అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందుచేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 19రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను. 20ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను. 21ఆ దినములలో మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలో చించుకొని యుండిరి. 22ఈ సంగతి మొర్దకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై పేరట రాజునకు దాని తెలియ జేసెను. 23ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజ మాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in