YouVersion Logo
Search Icon

ప్రసంగి 7

7
1సుగంధతైలముకంటె మంచిపేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. 2విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. 3నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. 4జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును. 5బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 6ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము. 7అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును. 8కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు 9ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. 10ఈ దినములకంటెమునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు 11జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము. 12జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము. 13దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును? 14సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.
15నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు. 16అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు? 17అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు; నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు? 18నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును.
19పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము. 20పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు. 21నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. 22నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా.
23ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను. 24సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు 25వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుటకును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని. 26మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ ; దేవునిదృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు. 27సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది. 28అదేదనగా వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. 29ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in