ప్రసంగి 3
3
1ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 2పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, 3చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; 4ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; 5రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు; 6వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు; 7చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; 8ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. 9కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి? 10నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. 11దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. 12కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని. 13మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని. 14దేవుడుచేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. 15ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగి నదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును.
16మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. 17ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని. 18కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని. 19నరులకు సంభవించునది యేదో అదే మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము. 20సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. 21నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును? 22కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.
Currently Selected:
ప్రసంగి 3: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.