ప్రసంగి 12
12
1దుర్దినములు రాకముందే–ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. 3ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు. 4తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమునుచేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు. 5ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు. 6వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్దకుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును. 7మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
8సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము.
9ప్రసంగి జ్ఞానియైయుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. 10ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను. 11జ్ఞానులు చెప్పు మాటలుములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి. 12ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.
13ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. 14గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
Currently Selected:
ప్రసంగి 12: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.