YouVersion Logo
Search Icon

ప్రసంగి 1

1
1దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు.
2–వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 3సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? 4తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది. 5సూర్యుడుదయించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. 6గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును. 7నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును 8ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు. 9మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు. 10ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. 11పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు.
12ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజునైయుంటిని. 13ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము#1:13 శిక్షణము. నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది. 14సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి. 15వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు. 16యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేననుకొంటిని. 17నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని. 18విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in