YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 8

8
1మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీపితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. 2మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. 3ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ జేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. 4ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. 5ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని 6ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. 7నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము. 8అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లునుగల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. 9కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. 10నీవుతిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను. 11నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని 12మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, 13నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు 14నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో. 15తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, 16తుదకు నీకు మేలుచేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. 17అయితే మీరు–మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. 18కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. 19నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. 20నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 8