YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 6

6
1నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును 2నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే. 3కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలుకలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను.
4ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 5నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 6నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. 8అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. 9నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
10నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను 11నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవుతిని తృప్తిపొందినప్పుడు 12దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము. 13నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. 14మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు. 15నీమధ్యను నీ దేవుడైన యెహోవా రోషముగల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీమీద రగులుకొని దేశములో నుండకుండ నిన్ను నశింపజేయును.
16మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. 17మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. 18నీకు మేలు కలుగునట్లును, నీ యెదుటనుండి నీ సమస్త శత్రువులను వెళ్లగొట్టెదనని 19యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణముచేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును, నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను.
20ఇకమీదట నీ కుమారుడు–మన దేవుడైన యెహోవా మీకాజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు 21నీవు నీ కుమారునితో ఇట్లనుము–మనము ఐగుప్తులో ఫరోకు దాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను. 22మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరో మీదను అతని యింటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నుల యెదుట కనుపరచి, 23తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడనుండి మనలను రప్పించెను. 24మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను. 25మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in