YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 30

30
1నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన 2సమస్త జనములమధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల 3నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. 4మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును. 5నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును. 6మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును. 7అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువులమీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పిం చును. 8నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు. 9-10మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవావైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలుచేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.
11నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. 12మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు; 13మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు. 14నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది.
15చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను. 16నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. 17అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించినయెడల 18మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేకదినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. 19నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 30