YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 23

23
1గాయమునొందిన వృషణములుగలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజములో చేరకూడదు.కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు. 2వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.
3అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. 4ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని#23:4 మెసపొతేమియ. పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. 5అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. 6నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.
7ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. 8వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.
9నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను.
10రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడలవాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను. 11అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. 12పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను. 13మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. 14నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను.
15తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. 16అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదానియందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు.
17ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా#23:17 దేవదాసి. ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు. 18పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.
19నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు. 20అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవుచేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
21నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. 22నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు. 23నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.
24నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చునుగాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు. 25నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చునుగాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in