ద్వితీయోపదేశకాండము 2
2
1మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగి తిమి. 2అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను –మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును; 3ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము 4–శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. 5వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. 6మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. 7నీచేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు. 8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితిమి.
9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను–మోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
10పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు. 11మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. 12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి. 13కాబట్టి–మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితిమి. 14మనము కాదేషు బర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరు దాటువరకు, అనగా యెహోవావారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు 15సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.
16సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను. 17–నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు. 18-19అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను. 20అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు. 21వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. 22అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటివరకు వారిచోట నివసించుచున్నారు. 23గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్త్తోరీయులు నశింపజేసి వారిచోట నివసించిరి. 24మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. 25నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశములవారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.
26అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోనురాజైన సీహోనునొద్దకు దూతలను పంపి 27–నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును. 28నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము. 29శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని. 30అయితే హెష్బోనురాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను. 31అప్పుడు యెహోవా–చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను. 32సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా 33మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతముచేసి 34ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితిమి. 35పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. 36అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను. 37అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమున కైనను నీవు సమీపింపలేదు.
Currently Selected:
ద్వితీయోపదేశకాండము 2: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.