YouVersion Logo
Search Icon

దానియేలు 5

5
1రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను. 2బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. 3అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. 4వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా 5ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా 6అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను. 7రాజు గారడీ విద్యగలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను–ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును. 8రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను. 9అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడాయెను. 10రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను– రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. 11నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడైయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీవిద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై యధిపతిగా అతని నియమించెను. 12ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.
13అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను–రాజగు నా తండ్రి యూదయలోనుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా? 14దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్నుగూర్చి వింటిని. 15ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి. 16అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనయెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు. 17అందుకు దానియేలు ఇట్లనెను–నీ దానములు నీయొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియ జెప్పెదను. 18రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. 19దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్టములును జనులును ఆయా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి. 20అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను. 21అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. 22-23బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమం దున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉప పత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. 24కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. 25ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను. 26టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. 27ఫెరేస్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. 28-29బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వముచేయు టలో నతడు మూడవ యధికారియని చాటించిరి. 30ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. 31మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in