YouVersion Logo
Search Icon

దానియేలు 1

1
1యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా 2ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను. 3-4రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను – ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి, తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. 5మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. 6యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి. 7నపుంస కుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను. 8రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా 9దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను 10–మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. 11నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామ కునితో దానియేలు ఇట్లనెను. 12భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము. 13పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము. 14అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను. 15పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా 16రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను. 17ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను. 18నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. 19రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. 20రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 21ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in