YouVersion Logo
Search Icon

కొలొస్సయులకు 3:1-14

కొలొస్సయులకు 3:1-14 TELUBSI

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.