YouVersion Logo
Search Icon

ఆమోసు 8

8
1మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి 2–ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా–వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా–నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను. 3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. 4దేశమందు బీదలను మ్రింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా, 5–తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొనువారలారా, 6దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి. 7యాకోబుయొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా–వారిక్రియలను నేనెన్నడును మరువను. 8ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును. 9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును. 10మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైనశ్రమదినముగా ఉండును. 11రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. 12కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు; 13ఆ దినమందు చక్కని కన్యలును యౌవనులును దప్పిచేత సొమ్మసిల్లుదురు. 14షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయేర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.

Currently Selected:

ఆమోసు 8: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in