YouVersion Logo
Search Icon

ఆమోసు 5

5
1ఇశ్రాయేలువారలారా, మిమ్మునుగూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. 2కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది. 3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు వారిలో వెయ్యిమందియై బయలు వెళ్లిన పట్టణస్థులలో నూరుమంది తప్పించుకొని వత్తురు; నూరుమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో పదిమంది తప్పించుకొని వత్తురు. 4ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగా–నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు. 5బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. 6యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీదపడి దాని నాశనముచేయును. 7న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా, 8ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు. 9ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. 10అయితే గుమ్మములో నిలిచి బుద్ధిచెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. 11దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన 12మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు. 13ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. 14మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును. 15కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును. 16దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి–అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. 17ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును. 18యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము. 19ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును. 20యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా? 21మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. 22నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధానబలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. 23మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. 24నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి. 25ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? 26మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా. 27కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు.

Currently Selected:

ఆమోసు 5: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in