YouVersion Logo
Search Icon

ఆమోసు 2

2
1యెహోవా సెలవిచ్చునదేమనగా–మోయాబు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి. 2మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. 3మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
4యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమపితరులనుసరించిన అబద్ధములను చేపెట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి. 5యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.
6యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు. 7దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు; 8తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. 9దేవదారు వృక్షమంత యెత్తయినవారును సింధూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా, 10మరియు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా. 11మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను#2:11 అనగా, వ్రతము పెట్టినవారుగాను. నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు. 12అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. 13ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. 14అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొనజాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును. 15విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. 16మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యముగలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.

Currently Selected:

ఆమోసు 2: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in