YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 7

7
1ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను. 2అందుకు స్తెఫను చెప్పినదేమనగా–సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై 3–నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. 4అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను. 5ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను. 6అయితే దేవుడు–అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. 7మరియు దేవుడు–ఏ జనమునకు వారు దాసులైయుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. 8మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. 9ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి 10దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అ నుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. 11తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహుశ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. 12ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్క డికి మొదటి సారి పంపెను. 13వారు రెండవసారి వచ్చి నప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. 14యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు 15యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, 16షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి. 17అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను. 18ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి 19తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. 20ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను. 21తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను. 22మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. 23అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. 24అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను. 25తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలం చెను గాని వారు గ్రహింపరైరి. 26మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యా యము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను. 27అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు–మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? 28నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను. 29మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 30నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను. 31మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా 32–నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు. 33అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి. 34ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదు నని అతనితో చెప్పెను. 35–అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను.
36ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
37–నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును
అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే. 38సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. 39ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై 40– మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. 41ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. 42అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచి పెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.
–ఇశ్రాయేలు ఇంటివారలారా
మీరు అరణ్యములో నలువది యేండ్లు
బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?
43మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు
గుడారమును
రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని
పోతిరి
గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
44అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను. 45మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను. 46అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను. 47-50అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను
–ఆకాశము నా సింహాసనము
భూమి నా పాదపీఠము
మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?
నా విశ్రాంతి స్థలమేది?
ఇవన్నియు నా హస్తకృతములు కావా?
అని ప్రభువు చెప్పుచున్నాడు
అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
51ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా,#7:51 మూలభాషలోవంచని మెడగలవారలారా, హృదయములయందును, చెవులయందును సున్నతి పొందనివారలారా. మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 52మీపితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. 53దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.
54వారీ మాటలు విని కోపముతో మండిపడి#7:54 మూలభాషలోతమహృదయములయందు నరకబడినవారై. అతనిని చూచి పండ్లుకొరికిరి. 55అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి 56–ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. 57అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి 58పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి. 59ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for అపొస్తలుల కార్యములు 7