అపొస్తలుల కార్యములు 24
24
1అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. 2పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను–
3మహాఘనతవహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. 4నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. 5ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి, 6-8మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.#24:6-8 కొన్ని ప్రాచీన ప్రతులలో–మా ధర్మశాస్తము చొప్పున తీర్పు తీర్చవలెనని యుంటిమిగాని, సహస్రాధిపతియైన లూసియవచ్చి, చాల బలత్కారముతో మా చేతులలోనుండి ఇతని తీసికొనిపోయి, యితనిమీద నేరము మోపువారిని తమయొద్దకు రావలెనని ఆజ్ఞాపించెను–అని కూర్చబడియున్నది. తమరు విమర్శించినయెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను. 9యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.
10అప్పుడు అధిపతి–మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను–
తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. 11యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును. 12దేవాలయములోనేమి, సమాజమందిరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుట యైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు. 13మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు. 14-15ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను. 16ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను. 17కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని. 18నేను శుద్ధి చేసికొనిన వాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండ లేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి; 19నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను. 20-21లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీయొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.
22ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై–సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. 23మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.
24కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను. 25అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమునుగూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి–ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. 26తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 27రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 24: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.