అపొస్తలుల కార్యములు 2
2
1పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. 2అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. 3మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ 4అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
5ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. 6ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. 7అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? 8మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? 9పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు, 10కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, 11క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. 12అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 13కొందరైతే–వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
14అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను–యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. 15మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు. 16యోవేలు ప్రవక్త ద్వారా చెప్ప బడిన సంగతి యిదే, ఏమనగా
17–అంత్యదినములయందు నేను
మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను
మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు
మీ యౌవనులకు దర్శనములు కలుగును
మీ వృద్ధులు కలలు కందురు.
18ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను
నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
19పైన ఆకాశమందు మహత్కార్యములను
క్రింద భూమిమీద సూచకక్రియలను
రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
20 ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు
సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
21అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు
వారందరును రక్షణపొందుదురు
అని దేవుడు చెప్పుచున్నాడు.
22ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబర చెను; ఇది మీరే యెరుగుదురు. 23దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత#2:23 లేక, అక్రమకారులచేత. సిలువ వేయించి చంపితిరి. 24మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
25ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను
–నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచు చుంటిని
ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను.
26కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను
మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.
27నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు
నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
28నాకు జీవమార్గములు తెలిపితివి
నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు.
29సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; 30అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయైయుండెను గనుక
–అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద
ఒకని కూర్చుండబెట్టుదును
అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి, 31క్రీస్తు#2:31 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను. 32ఈ యేసును దేవుడు లేపెను; దీనికి#2:32 లేక, ఈయనకు. మేమందరము సాక్షులము. 33కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మనుగూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు. 34దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–
నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ
ముగా ఉంచువరకు
35నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
36మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
37వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని#2:37 మూలభాషలో, పొడువబడి. –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా 38పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 39ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. 40ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగు#2:40 మూలభాషలో, పొడువబడి. ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. 41కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి. 42వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
43అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. 44విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. 45ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 2: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.