YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 18

18
1అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను. 2యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు. 3వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి. 4అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
5సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను. 6వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని–మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు.#18:6 మూలభాషలో–మీ రక్తము మీ తలమీదనే యుండును. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి 7అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను. 8ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి. 9రాత్రివేళ దర్శనమందు ప్రభువు–నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. 10నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా 11అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.
12గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి 13–వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. 14పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను – యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే. 15ఇది యేదో యొక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమునుగూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శచేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి 16వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను. 17అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.
18పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి. 19వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను. 20వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా 21అతడు ఒప్పక–దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను. 22తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను. 23అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను.
24అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను. 25అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను. 26ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. 27తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహ పరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను. 28యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in