అపొస్తలుల కార్యములు 16
16
1పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ . తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. 2అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు. 3అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను. 4వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. 5గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
6ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని 7-8యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. 9అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి–నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. 10అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి.
11కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. 12మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి. 13విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి. 14అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగుపొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. 15ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.
16మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపెట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. 17ఆమె పౌలును మమ్మును వెంబడించి–ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. 18ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి–నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.
19ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి. 20అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి–ఈ మనుష్యులు యూదులై యుండి 21రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. 22అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. 23వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి. 24అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను. 25అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. 26అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. 27అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. 28అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. 29అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి 30వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. 31అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి 32అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. 33రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. 34మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
35ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు–ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి. 36చెరసాల నాయకుడీమాటలు పౌలునకు తెలిపి–మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. 37అయితే పౌలు–వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను. 38ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి, 39వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి – పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. 40వారు చెరసాలలోనుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 16: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.