YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 12

12
1దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని 2యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 3ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు. 4అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల#12:4 పదునారుగురు. సైనికులకు అతనిని అప్పగించెను. 5పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. 6హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. 7ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను. 8అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. 9అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను. 10మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.
11పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను. 12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి. 13అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. 14ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. 15అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి. 16పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. 17అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి – యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను. 18తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు. 19హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.
20తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. 21నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా 22జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. 23అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
24దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
25బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in