YouVersion Logo
Search Icon

2 థెస్సలొనీకయులకు 2

2
1సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల 2మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటనుబట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము. 3మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు#2:3 మూలభాషలో–నాశనపుత్రుడు. పాపపురుషుడు#2:3 అనేక ప్రాచీన ప్రతులలో–ధర్మవిరుద్ధపురుషుడు అని పాఠాంతరము. బయలుపడితేనేగాని ఆ దినము రాదు. 4ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. 5నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా? 6కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు. 7ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును. 8అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును. 9నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను 10దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును 11-12ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
13ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును#2:13 అనేక ప్రాచీన ప్రతులలో–ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది. ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము. 14మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. 15కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి, మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను#2:15 లేక, పారంపర్యములను. చేపట్టుడి.
16-17మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 2 థెస్సలొనీకయులకు 2