2 సమూయేలు 3
3
1సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
2హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను. 3కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను. 4నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను. 5ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు.
6సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను. 7అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెను–నా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా 8అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని–నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా? 9యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చని యెడల 10దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదావారిమీదను నేను స్థిరపరచెదననెను. 11కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను.
12అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి –ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీతట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు– మంచిది; నేను నీతో నిబంధన చేసెదను. 13అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను. 14మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా 15ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను. 16దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు–నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.
17అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి –దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకుమునుపు కోరితిరి గదా 18–నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. 19మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను. 20అందునిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందుచేయించెను. 21అంతట అబ్నేరు–నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను. 22పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందిపోటునుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము తీసికొనిరాగా అబ్నేరు హెబ్రో నులో దావీదునొద్ద లేకపోయెను, దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి యుండెను. 23అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని 24యోవాబు రాజునొద్దకు వచ్చి–చిత్తగించుము, నీవు ఏమిచేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చి నప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి? 25నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవుచేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి 26దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా యను బావిదగ్గరనుండి అతనిని తోడుకొని వచ్చిరి; అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. 27అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు–సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను. 28ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగా–నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే. 29ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగియైనను కఱ్ఱపెట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. 30ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి.
31దావీదు–మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను. 32రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులందరును ఏడ్చిరి. 33మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.
34ఎట్లనగా
అబ్నేరూ
నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా?
నీచేతులకు కట్లులేకుండగను
నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను
దోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి. 35ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసి–సూర్యుడు అస్తమించకమునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక నెను. 36జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.
37నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను. 38పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను–నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. 39పట్టాభి షేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడ నైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడుచేయునుగాక.
Currently Selected:
2 సమూయేలు 3: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.