2 సమూయేలు 24
24
1ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి–నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 2అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి–జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా 3యోవాబు–జనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను. 4అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలువెళ్లి 5యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్యనుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి 6అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. 7అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణమునకును హివ్వీయులయొక్కయు కనానీయులయొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి. 8ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 9అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.
10జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు–నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవిచేయగా 11ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 12నీవు పోయి దావీదుతో ఇట్లనుము– యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనినయెడల నేనది నీమీదికి రప్పించెదను. 13కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెను–నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుము చున్న నీ శత్రువులయెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడుదినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. 14అందుకు దావీదు – నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. 15అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళవరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయేర్షెబావరకు డెబ్బది వేలమంది మృతినొందిరి. 16అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది–అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవాదూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా 17దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థిం చెను–చిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
18ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి–నీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుమని అతనితో చెప్పగా 19దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను. 20అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసి–నా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా 21దావీదు –ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను, 22అందుకు అరౌనా–నా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. 23రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి– నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా 24రాజు–నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను. 25అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.
Currently Selected:
2 సమూయేలు 24: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.