YouVersion Logo
Search Icon

2 సమూయేలు 16

16
1దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొనివచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసి యుండెను. 2రాజు–ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా–గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా 3రాజు–నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా –చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి యిప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను. 4అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబా–నా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.
5రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అను నొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు 6జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను. 7ఈ షిమీ–నరహంతకుడా, దుర్మా ర్గుడా 8ఛీపో, ఛీపో, –నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా 9సెరూయా కుమారుడైన అబీషై–ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను. 10అందుకు రాజు –సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగా–నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి 11అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా–నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి. 12యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టు నేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలుచేయునేమో. 13అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను. 14రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.
15అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి. 16దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి–రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా 17అబ్షాలోము–నీ స్నేహితునికి నీవుచేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితోకూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా 18హూషై–యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును. 19మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను. 20అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా 21అహీతోపెలు–నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. 22కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. 23ఆ దినములలో అహీ తోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 సమూయేలు 16