2 సమూయేలు 12
12
1కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను–ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. 2ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను. 3అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. 4అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను. 5దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించుకొని–యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. 6వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.
7నాతాను దావీదును చూచి–ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి 8నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. 9నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? 10నీవు నన్ను లక్ష్యముచేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును. 11నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగా–నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను. 12పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయిం తును అనెను. 13–నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను–నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. 14-15అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
16యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. 17దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను. 18ఏడవదినమున బిడ్డ చావగా–బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. 19ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చని పోయెనను సంగతి గ్రహించి–బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు–చనిపోయెననిరి. 20అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను. 21అతని సేవకులు–బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దానికొరకు ఏడ్చుచుంటివిగాని అది మరణమైనప్పుడు లేచి భోజనముచేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా 22అతడు–బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని. 23ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను. 24తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. 25యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా#12:25 యెహోవాకు ప్రియుడు. అని అతనికి పేరు పెట్టెను.
26యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. 27దావీదునొద్దకు అతడు దూతలను పంపి–నేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని; 28నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానముచేయగా 29దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంత యెత్తుండెను. 30మరియు అతడు పట్టణములోనుండి బహువిస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను. 31పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.
Currently Selected:
2 సమూయేలు 12: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.