YouVersion Logo
Search Icon

2 సమూయేలు 10

10
1పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. 2దావీదు – హానూను తండ్రియైన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని, అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకులచేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా 3అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవిచేసిరి–నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీయొద్దకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచ లేదా? 4అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, సగము గడ్డము గొరిగించి, వారు తొడుగు కొనిన బట్టలను నడిమికి పిఱ్ఱలమట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను. 5ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు, ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి–మీ గడ్డములు పెరుగువరకు యెరికోపట్టణమందు ఆగి అటుతరువాత రండని వారితో చెప్పుడనెను. 6–దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేలమంది కాల్బలమును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను, టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. 7దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను. 8అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియనులును రెహోబు సిరియనులును మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి. 9యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొన బోయెను. 10అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు 11అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించినయెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను. 12అప్పుడు–ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చు కొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి 13యోవాబును అతనితోకూడ నున్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి. 14సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. 15అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసి కొని గుంపుకూడిరి. 16హదదెజెరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. 17హదదెజెరు సైన్యాధిపతియగు షోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దానునది దాటి హేలామునకు వచ్చెను. 18సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులలో ఏడు వందలమంది రథికులను నలువదివేలమంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. 19హదదెజెరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయముచేయుట మానిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in