YouVersion Logo
Search Icon

2 రాజులు 8

8
1ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి–యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి–నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా 2ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను. 3అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. 4రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి–ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను. 5అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ–నా యేలినవాడ వైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా 6రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.
7ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని 8హజాయేలును పిలిచి–నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయి–ఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను. 9కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచి–నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు–నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపె నని చెప్పెను. 10అప్పుడు ఎలీషా–నీవు అతని యొద్దకు పోయి–నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి 11హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. 12హజాయేలు–నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను. 13అందుకు హజాయేలు–కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా–నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచియున్నాడనెను. 14అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు–ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు– నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను. 15అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.
16అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను. 17అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడైయుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను. 18ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 19అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. 20ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున 21యెహోరాము తన రథములన్నిటిని తీసికొనిపోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదో మీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమతమ గుడారములకు పారిపోయిరి. 22అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను. 23యెహోరాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 24యెహోరాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. 25అహాబు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోరాము ఏలు బడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేలనారంభించెను. 26అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడైయుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలురాజైన ఒమ్రీ కుమార్తె. 27అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడు తనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు. 28అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియారాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి. 29రాజైన యెహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in