YouVersion Logo
Search Icon

2 రాజులు 4

4
1అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా 2ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను. 3అతడు–నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము; 4అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా 5ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. 6పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను. 7ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
8ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను. 9కాగా ఆమె తన పెనిమిటిని చూచి–మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. 10కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పు డెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను. 11ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. 12పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి–ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు 13అతడు–నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆప్రకారము ఆమెతో అనెను. అందుకామె–నేను నా స్వజనులలో కాపురమున్నాననెను. 14ఎలీషా–ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గేహజీ–ఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. 15అందుకతడు–ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా 16ఎలీషా –మరుసటియేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని–దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాల నైన నాతో అబద్ధమాడవద్దనెను. 17పిమ్మట ఆ స్త్రీ గర్భవతియై మరుసటియేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. 18ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడు–నా తలపోయెనే నా తల పోయెనే, అని తన తండ్రితో చెప్పెను. 19అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా 20వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లియొద్దకు తీసికొనిపోయెను. పిల్లవాడు మధ్యాహ్నమువరకు తల్లి తొడమీద పండుకొని యుండి చనిపోయెను. 21అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి 22–ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము; నేను దైవజనునియొద్దకు పోయి వచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా 23అతడు–నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె–నేను పోవుట మంచిదని చెప్పి 24గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పని వానితో–శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనేగాని నిమ్మళముగా తోలవద్దనెను. 25ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనునియొద్దకు వచ్చెను. దైవజనుడు దూరమునుండి ఆమెను చూచి– అదిగో ఆ షూనేమీయురాలు; 26నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి–నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె– సుఖముగా ఉన్నామని చెప్పెను. 27పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు – ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. 28అప్పుడు ఆమె–కుమారుడు కావలెనని నేను నా యేలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవిచేయగా 29అతడు–నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడినయెడల వారికి నమస్కరింపవద్దు; ఎవరైనను నీకు నమస్కరించినయెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖముమీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. 30తల్లి ఆ మాట విని–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతోకూడ పోయెను. 31గేహజీ వారికంటె ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెనుగాని యే శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి – బాలుడు మేలుకొనలేదని చెప్పెను. 32ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి 33తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి 34మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. 35తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను. 36అప్పుడతడు గేహజీని పిలిచి–ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు–నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను. 37అంతట ఆమె లోప లికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొనిపోయెను.
38ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి –పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను. 39అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను. 40తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి –దైవజనుడా,కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి. 41అతడు–పిండి కొంత తెమ్మనెను. వారు తేగా–కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగాకుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.
42మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. 43అయితే అతని పనివాడు–నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు–వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను. 44పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in