2 రాజులు 12
12
1యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. 2యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడైయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. 3అయితే ఉన్నతస్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
4యోవాషు యాజకులను పిలిపించి–యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును, 5యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. 6అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరముయొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక 7యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించి–మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను. 8కాబట్టి యాజకులు–మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుట మా వశములేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి. 9అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. 10పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధానమంత్రియును ప్రధానయాజకుడును వచ్చి, యెహోవామందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి. 11తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారి కప్పగించిరి; వీరు యెహోవామందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని 12యెహోవామందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి. 13యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకా లైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదుగాని 14మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగుచేయించిరి. 15మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు. 16అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.
17అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా 18యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్దనుండి తిరిగిపోయెను. 19యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 20అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటికి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. 21ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయెను.
Currently Selected:
2 రాజులు 12: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.