2 రాజులు 10
10
1షోమ్రోనులో అహాబునకు డెబ్బదిమంది కుమారు లుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులోనుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచినవారికిని పంపి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా–మీ యజమానుని కుమారులు మీయొద్ద నున్నారు; 2మరియు మీకు రథములును గుఱ్ఱములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు గదా 3కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి. 4వారు ఇది విని బహు భయపడి–ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలక పోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని 5కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి–మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి. 6అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి–మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజమానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిమంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దలయొద్ద ఉండిరి. 7కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బదిమంది రాజకుమారులను పట్టుకొని చంపి, వారి తలలను గంపలలో పెట్టి, యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. 8దూత అతనియొద్దకు వచ్చి–రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు–ఉదయమువరకు ద్వారము బయటిస్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను. 9ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి, జనులందరిని చూచి–మీరు నిర్దోషులు, నేను నా యజమానునిమీద కుట్రచేసి అతని చంపితిని; అయితే వీరందరిని ఎవరు చంపిరి? 10అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను. 11ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు. 12అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి 13యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని– మీరు ఎవరని వారి నడుగగా వారు–మేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి. 14వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱె వెండ్రుకలు కత్తి రించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.
15అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి–నీయెడల నాకున్న ట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహో నాదాబు–ఉన్నదనెను. –ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని 16–యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి. 17అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయువరకు హతముచేయుట మానకుండెను. 18తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–అహాబు బయలుదేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను, 19కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందరిని వాని భక్తులనందరిని వారి యాజకులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలునకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. 20మరియు యెహూ–బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి. 21యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈతట్టునుండి ఆతట్టువరకు నిండిపోయెను. 22అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచి–బయలునకు మ్రొక్కువారికందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. 23యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ – యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారుమాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. 24బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూయెనుబదిమందిని బయట కావలియుంచి–నేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొనిపోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వానిపోనిచ్చినవాని ప్రాణముతీతునని వారితో చెప్పి యుండెను. 25దహనబలులనర్పించుట సమాప్తికాగా యెహూ–మీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతులతోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి 26బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి. 27మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది 28ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలువారిమధ్యనుండకుండ నాశనము చేసెను. 29అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు. 30కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను–నీవు నా హృదయాలోచనయంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలురాజ్యసింహాసనముమీద ఆసీనులగుదురు. 31అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాముచేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను.
32ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను. 33హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబే నీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. 34యెహూచేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 35అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. 36షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు.
Currently Selected:
2 రాజులు 10: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.