YouVersion Logo
Search Icon

2 కొరింథీయులకు 6

6
1కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.
2–అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని;
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని
అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 3మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక 4శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును 5దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై, 6పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను 7సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి, 8-10ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుం డియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
11ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాటలాడుచున్నాను,#6:11 మూలభాషలో–మా నోరు మీతట్టు విప్పబడియున్నది. మా హృదయము విశాలపరచబడి యున్నది. 12మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది. 13మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పు చున్నాను.
14మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? 15క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? 16-18దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.
–నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి
దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
–కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి
ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని
ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు
నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై
యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై
యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 2 కొరింథీయులకు 6